Pages

Thursday, November 18, 2010

మంచి పుస్తకం, తెలుగులో!

మా పిల్లలకు తెలుగు గుణింతాలు కూడా కలుపుకుని, అక్కడక్కడా వత్తులు కూడా అలవాటయ్యి, తెలుగు పదజాలం పెరిగినందువల్ల పదాలు గుణించుకుని చదవ గలుగుతున్నారు అనుకున్నాక, మంచిపుస్తకం వారి పుస్తకాల గురించి తెలిసి, కొని తెప్పించుకునే అవకాశం దొరికింది.

ఇది boxed set అనమాట. మొత్తం 18 పుస్తకాలు. ఇందులో అతి సులభం నుంచి కొద్దిగా కష్టం అనిపించే వరకూ ఉన్నాయి. రంగులతో ఆ level పుస్తకం పైన తెలుస్తూ ఉంటుంది. "పిల్లల భాషా ప్రపంచం - పుస్తకాల పరిచయం" అన్న పేరుతో ఈ సంగ్రహం దొరుకుతుంది. పేరుని సార్థకం చేస్తాయి ఈ పుస్తకాలు.

ఇందులో మా చిన్నబ్బాయిని ఆకర్షించిన పుస్తకం "సబ్బు". సబ్బూ, నీళ్ళు వాడికి అతి ఇష్టమైన వస్తువులలో చాలా ముందు ఉంటాయి. అల్లరి పిల్లాడి చేష్టలూ, మాటి మాటికీ మురికి చేసుకుని , ఇక కడుక్కోవడం ఎందుకూ అని వాడు అంటూ కథ ముగియడమూ సరదాగా ఉంటాయి. మా వాడికి కడుక్కోవడానికి కారణము ఉంటే చాలు, అది వేరే సంగతి.

ఐతే "క్లిష్టత" ని పెంచడం అన్నది నాకు ఎక్కువగా పేజీల సంఖ్యలోనే కనిపించింది. వారు డబ్బా పై వివరించినంత తేడా కనిపించలేదు. కానీ నష్టం లేదు. ఈ పుస్తకాల సెట్టు చదవడం నేర్చుకునే దశలో, చదవడం బాగా లవాటు కావడానికీ చాలా బావుంటుంది. పిల్లలని ఆకర్షించే బొమ్మలూ, సన్నివేశాలూ, చిన్న చిన్న వాక్యాలూ అన్నీ అనువుగా ఉన్నాయి. తెలుగు భాష అలవాటు చెయ్యడానికి ఇవి కొనదగ్గ పుస్తకాలు అని నేను నిస్సందేహంగా చెప్తాను.

ఐతే, ఎప్పటిలాగే, నా ఆలోచనలు కొన్ని:
ముందుగా, చిన్నవే అయినా, చెప్పాలనిపించినవి:
కొన్ని వాక్యాలు కాస్త నిండుగా రాస్తే బావుంటుందనిపించాయి, "వస్తా" బదులు "వస్తాను" అనీ, "ఆపేయ్" బదులు "ఆపెయ్యి" రాస్తే బావుంటుందనిపించింది. అలాగే  ఆంగ్లంలో "put off the light" బదులు "turn off the light" అనీ, (అన్నట్లు ఇవన్నీ ద్విభాషా పుస్తకాలు), దానికి అనువాదంగా తెలుగులో "లైటు తియ్యి" బదులు "లైటు ఆపెయ్యి" అనో వ్రాసి ఉంటే బాగుండేది అనిపించింది.

ఇంకొకటి, నా మటుకు నాకు, ఇవి ద్విభాషా పుస్తకాలు కానక్కర్లేదు అని గట్టి నమ్మకం.
తెలుగులోనే ఉంటే బావుంటుంది. ఆంగ్లం అనవసరమైన distraction. చాలా చిన్న వాక్యాలు. బొమ్మలే పెద్ద ఆధారం, అర్థం చేసుకోవడానికి. ఇక ఆంగ్లం అవసరం లేదు అని నా ఉద్దేశం. మరి తెలుగు ఆధారంగా ఆంగ్లం నేర్పేందుకు, బహుశా బావుంటాయేమో? ఏమో!

అన్నిటికన్నా పెద్ద కంప్లైంటు, ఇవి అనువాదాలుగానే తప్ప నేరుగా తెలుగులో ఇలా ఆలోచించి రాయలేమా? ఎందుకు ఆ బొమ్మలూ, ఊహా, భాషా పరమైన శ్రమ మన పబ్లిషర్లు తెలుగులో పెట్టడానికి కష్టపడతారు? నాకు అంతు చిక్కని ప్రశ్న. తెలుగులో రాసిన చందమామ కథలు పన్నెండు భాషలలోకి అనువాదమౌతాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు మాత్రం చాలా మటుకు అనువాదాలే లభ్యం అవుతాయి.

ఇతర భాషలలోని మంచి పుస్తకాలకి నాణ్యమైన అనువాదాలు లభ్యం కావా లనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ మొదటి మాటల నుంచీ కూడా అనువాదాలే ఐతే బాధేస్తుంది.

ఈ టపా చదివే వారికి ఈ లంకెలు ఆసక్తికరంగా అనిపించవచ్చు.

చిన్న, పెద్ద - తెలుగు4కిడ్స్ వీడియో

గుణింతాలు - బాలభారతి వారి వీడియో

Thursday, November 11, 2010

తెలుగు4కిడ్స్ కబుర్లు


కాళ్ళెందాకా పోయాయి? - ఈ పాట సాహిత్యం మాగంటి వారి సైటులో దొరుకుతుంది.
ఈ నాటి తండ్రీ కూతురు కలిసి రాసిన కొత్త పాట ఇక్కడ చూడగలరు.
ఇది తెలుగు4కిడ్స్ కోసం పంపించిన తండ్రీ కూతుర్లకు ధన్యవాదాలు.

కొత్తపల్లి వారి పత్రికలో తెలుగు4కిడ్స్ "బొమ్మకు కథ" శీర్షిక నిర్వహణలో పాలుపంచుకుంటోంది.
ఇందులో "భయం" అనే అంశంతో ఇచ్చిన బొమ్మకు మంచి స్పందన వచ్చింది.
పిల్లల మనసు పిల్లలకే బాగా తెలుస్తుందేమో అని ఈ నెల కూడ పిల్లలు వేసిన బొమ్మనే ఇంకొక దానిని
ఈ శీర్షికకు ఎన్నుకోవడం జరిగింది.

తెలుగు4కిడ్స్ కి అనుబంధంగా "తెలుగు మాటలు" కూడా మొదలు పెట్టడం జరిగింది
ఇందులో చిన్న చిన్న కథలు వినడానికీ, చిన్న చిన్న వ్యాసాలు చదవడానికీ చేర్చే ఉద్దేశ్యం ఉంది.
ఇందుకు ప్రేరణ స్టోరీనోరీ, మరియు, ఇక్కడి పాఠశాలలలో చదవడం ప్రోత్సహించడానికి అవలంబించే బోధనా పద్ధతులూ, సాధనాలూను. ఈ ప్రయత్నంలో ఆసక్తి ఉన్న పిల్లలూ పెద్దలూ అందరూ పాలు పంచుకోవచ్చు. పిల్లలు కథలే రాయక్కర్లేదు. బొమ్మలు వెయ్యవచ్చు. అతి తక్కువ నిడివితో వ్యాసాలూ రాయవచ్చు. చిన్న చిన్న వాక్యాలకి సైతం స్వాగతం చెప్తున్నాం.

తెలుగును పిల్లలకీ, పిల్లలని తెలుగుకీ దగ్గరగా చెయ్యడానికి మా వంతు ప్రయత్నం ఈ విధంగా కొనసాగుతోంది.

Tuesday, September 21, 2010

గొలుసు కథలు

(ఈ వ్యాసం మొదట పుస్తకం.నెట్ లో ప్రచురించబడింది.)

చిన్నప్పుడు విన్న మరిచిపోలేని కథలు కొన్ని కల్పన, రవికిరణ్ గార్ల పుణ్యమా అని, కొంతమంది బ్లాగర్లు గుర్తు చేసుకున్నారు. ఈగ కథ, పేను పెసర చేను కథ, ఏడు చేపల కథ లాంటి కథలను గొలుసు కథలంటారేమో కదా. అలా ఒక దానికి ఇంకొకటి కలుపుతూ కథ పొడుగ్గా తయారయ్యి చివరకు ఒక కొసమెరుపు ఉంటుంది సాధారణంగా. ఎందుకో మరి ఇటువంటి కథలు తెలుగులో పిల్లల్ల కథల పుస్తకాలలో కనిపించలేదు నాకు ఇంతవరకూ. ఏడు చేపల కథ పుస్తకంగా ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు. పుస్తకం.నెట్ వారు మంచిపుస్తకం వారితో ముచ్చటించినప్పుడు అనువాదాలు కాకుండా నేరుగా తెలుగులో కథలు కావాలంటే కష్టమన్నారు. ఇప్పుడు అంతర్జాలంలో కొన్ని కథలు బయటికి వచ్చాయి. ఇంకొంచెం ప్రయత్నిస్తే ఇంకెన్నో గుర్తుకు వస్తాయి.

చందమామకథలు అనగానే, అవి చిన్న పిల్లలకు పనికిరావనే అభిప్రాయం ఉండేది నాకు. చందమామ అంటే నాకెంతో ఇష్టం. కాని, ఆ కథలు కనీసం పదేళ్ళ పై వయసున్న పిల్లలకే అర్థం అవుతాయనుకునే దాన్ని. నా అదృష్టం కొద్దీ, నా కళ్ళూ తెరిపించేందుకు, పాత చందమామ కథలు ఆంగ్లంలోకి అనువదించే పనిలో నాకూ భాగం కలిగింది. ఆ విధంగా 1947 ప్రాంతాలలో కొన్ని కథలు, నా అంతట నేను ఎప్పుడో కాని చదివి ఉండే అవకాశం లేకపోయిన కథలు నేను చదవగలిగాను. మా పిల్లలతో పంచుకోగలిగాను. అందులో "బుళుక్కు" అనే కథకి మా చిన్నబ్బాయి బొమ్మ వేసిచ్చాడు కూడాను.

ఆ కథలలో ఒకటి,  చీమా, చిలకా పాయసం వండుకోవడంతో మొదలయ్యి, ఒక ప్రమాదం, తర్వాత కోపంలో అనుకున్న మాటలు నిజం కావడం జరిగి, తోటికోడళ్ళ భుజాలకు బిందెలు అంటుకు పోయేంతవరకూ ఒక దాని తరవాత ఒకటి వింత సంఘటనలు, చివరికి కథ సుఖాంతం. ఇటువంటి కథ ఇప్పటి కాలానికి తగ్గట్టు ఆంగ్లంలో The Rain Came Down!  మా పిల్లల కోసం చిన్నప్పుడు కొన్నాను. ఇలాంటి పుస్తకాలు ఎప్పటికీ ఉంచుకోవాలనిపిస్తుంది. నేను కొన్నింటిని వదలలేక, వదలలేక చదువుతారునుకున్న వారికి కొన్ని ఇచ్చాను. ఈ కథలు పిల్లలకి సరదాను, పెద్దవాళ్ళకి సందేశాలను ఇస్తాయి. ఆసక్తి కలవారు చందమామ ఆర్కైవులలో ఇలాంటి కథలను ఇంకా వెతికి పట్టుకోగలరు. ఒక క్లూ: 1947 దగ్గరి ప్రాంతాలలో ఇటువంటి కథలు ఎక్కువ ఉన్నాయి.

పేను, పెసర చేను కథ తెలిసినప్పుడూ ఇంకో ఆంగ్ల పుస్తకం గుర్తుకు వచ్చింది: "The Old Woman and the Rice thief". చూశారుగా, అట్ట ఏ స్థితిలో ఉందో. కానీ పుస్తకం భద్రంగా ఉంది. ఇది ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో అతి తక్కువ ధరకు కొన్నాము. ఇప్పటికీ అప్పుడప్పుడూ పిల్లలతో కలిసి పేజీలు తిరగేస్తుంటాము.




మన ఇల్లలికిన ఈగ కథ కి సమాంతరంగా ఇంకో పుస్తకం గుర్తుకు వస్తుంది: Why Mosquitoes Buzz in People's Ears.

ఆంగ్లంలో పుస్తకాల గురించి వివరంగా రాయట్లేదు. ఇచ్చిన లంకెను పట్టుకున్నా, గూగులమ్మను అడిగినా బోలెడన్ని వివరాలు లభ్యం. నేను నొక్కి చెప్పాలనుకున్న విషయం ఆ కథలు కాదు, ఆ కథలను పిల్లలకు అందించిన తీరు. ఇలా మనం పూనుకోవాలే కాని, నేరుగా తెలుగులో మనం చాలా పుస్తకాలను తయారు చేయ వచ్చు. కథకు తగ్గ బొమ్మలు, కథనం, ఓపికగా, ఇష్టంగా, శ్రద్ధగా జత చేసి చక్కగా పిల్లలనూ, తెలుగునూ, పాత కొత్త తరాలనూ ఒకరికి ఒకరిని దగ్గర చేయవచ్చు.

మరి పిల్లి మెడలో గంట కడదామా?

Tuesday, September 14, 2010

ఈనాడు వసుంధరలో - అంతర్జాలంలో తెలుగు పిల్లల కోసం


ఈనాడు వసుంధరలో ఈ నాడు అంతర్జాలంలో తెలుగు పిల్లల కోసం, పిల్లల చేత ప్రదర్శించబడుతున్న కథల గురించి కథనాలు ప్రచురించారు.
అందులో telugu4kiDs ను ప్రస్తావించారు. కొందరు ఆ కథనం చూసి telugu4kiDs ki వచ్చామని అభినందనలు, సంతోషం తెలియచేసారు.
సంతోషంగా ఉంది.
మా కుటుంబమంతా ఉత్సాహంగా పాల్గొనే  ఇష్టమైన పని telugu4kiDs . ఈ అభినందనలు, సంతోషము మా అందరివీ.
కొన్ని వివరాలు పొరపాటుగా ప్రచురించారు.
పూర్తి వివరాలు నా మాటలలో ఇక్కడ.
పరిచయం చేసుకునేటప్పట్నుంచి పొరపాట్ల గురించి చెప్పినప్పుడు కూడా ఎంతొ ససహృదయంతో సంభాషించిన హిదయ్ గారికి ధన్యవాదాలు.
కంప్యూటర్ ఎరా లో telugu4kiDs గురించి పరిచయం చేసిన జ్యోతి గారు ఈ నాడు ఈ నాడు దాకా పేరు తెలిసేలా చేసారు. తనకి ధన్యవాదాలు.
ప్రభవ పబ్లికేషన్స్ సరసన telugu4kiDs పరిచయం telugu4kiDs గౌరవాన్ని పెంచుతోంది.
జాబిల్లి గురించి ఈ మధ్యే తెలిసింది.  వారి పరిచయంతోనే ఈ నాడు కథనం మొదలయ్యింది. వారికి అభినందనలు.
కొత్తపల్లి వారి గురించీ, బుక్ బాక్స్ గురించీ కూడా తెలుగు4కిడ్స్ కథనంలో ప్రస్తావించడం ఆనందదాయకం.
 
బుక్ బాక్స్ వారి కథలను కొన్నిటిని తెలుగులోకి అనువదించి గొంతు అందించాను.
అందులో ఈ కథ పూర్తిగా ఉచితం. అందరూ చూడవచ్చు.

కొత్తపల్లి వారి ఉత్సాహంలో తెలుగు4కిడ్స్ కూడ కొంత పాలు పంచుకుంటోంది.
కొన్ని లంకెలు.
http://kottapalli.in/2010/09/టీ
http://kottapalli.in/2010/08/బొమ్మకు_కథ_రాయండి
http://kottapalli.in/2010/07/ఏమో_గుర్రం
http://kottapalli.in/2010/07/అమ్మ_దొంగా


అందరి అభిమానం, ఆశీర్వచనాలతో తెలుగు4కిడ్స్ తన ఆశయాలను అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

Tuesday, July 27, 2010

భయం?

ఈ రోజుల్లో భయపడడానికి కారణాలు అనేకం. ఐతే భయమనేది ఒక్కో సారి మన మనసులోనే ఉంటుంది. భయంకరాకారం ఉన్నంత మాత్రాన ఆ మనిషికి భయం వెయ్యదని అనుకుంటే పొరపాటే:)

మాలతి గారు ఈ విషయం ఎంతో సరదాగా చెప్పారు ఇక్కడ.

ఆ కథ ప్రేరణతో telugu4kiDs చేసిన ఒక చిన్ని ప్రయత్నం ఇక్కడ చూడగలరు.

మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

Thursday, June 10, 2010

పెద్దల కోసం పిల్లల పాటలు, పుస్తకాలు

అడగకుండానే  అందుబాటులో బోలెడన్ని ఆంగ్ల పాఠాలు. ఎన్నో చిన్న చిన్న రైమ్సు, చిట్టి పొట్టి పాటలు. బాల్యం సరదాగా గడవడానికి అందమైన ఆటపాటలు, కథలు, పుస్తకాలు ఆంగ్లంలో అందుబాటులో ఉంటాయి. అవసరం అయితే కొని అయినా ఆంగ్లం మన పిల్లలకి దగ్గర చేయడానికి మనం వెనకాడము. ఎంతగా తల్లి పిల్లలతో తన భాషలోనే మాట్లాడినా, సరదాలకి, ఆట పాటలకి వచ్చే సరికి ఆంగ్లం ఉన్నంత అనువుగా తెలుగు ఉన్నదా అంటే నా అవసరానికి మాత్రం ఆంగ్లమే ఎక్కువ అందుబాటులో ఉండినది అని చెప్తాను. తెలుగు దూరం ఐపోతోంది అన్న  బాధ ఉన్నా, బాల్యం ఇంకా విలువైనది కనుక నేను నేర్చుకునే లోపు వాళ్ళు సరదాలు కోల్పో కూడదు అని అందుబాటులో ఉన్న ఆటపాటలన్నీ  భాష గురించి ఆలోచించడం మాని, వారు ఆస్వాదించేలా చేసాను.  అప్పటికీ మొన్నో రోజు బయట ఉన్నప్పుడు చిన్న జల్లు పడుతుంటే మా చిన్నబ్బాయి "వానా వానా వల్లప్పా!" అంటూ ఆనందంగా పాడుతుంటే నాకు నేను మరీ అంత లోటు చెయ్యలేదని అనిపించింది.
పిల్లలకు అవసరమైన తెలుగు నేను నేర్చుకోవడం కోసం వారి పసితనంలో మొదలు పెట్టిన అన్వేషణ ఇంకా కొనసాగిస్తూ ఉన్నాను.  అలా తెలిసినవి నా వంటి వారి కోసం వీలైన చోటల్లా తెలియ చేస్తూ వస్తున్నాను.
ప్రస్తుతం, చిన్న పిల్లలకు పాడి వినిపించగల పాటలు కొన్ని, నాకు చాలా బాగా నచ్చినవి, అవి ఉన్న పుస్తకాలు, అంతర్జాలంలో అలాంటివి కనిపించే చోట్లు పరిచయం చేసే ప్రయత్నం.
మొదటి పుస్తకం "గోరు ముద్దలు". ఇది తెలుగు పుస్తకాల  కోసం అడగగా అడగగా, ఎలాగో నా చేతికి వచ్చిన పుస్తకం, చాలా పాతది అనుకుంటాను.
బాలల అకాడమి వారి ప్రచురణ. ఇందులో బాగా పరిచయమైన  "ఏనుగు ఏనుగు నల్లన", "తప్పట్లోయ్ తాళాలోయ్" వంటి పాటలు ఉన్నాయి. ఇందులో "చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం" పాట పూర్తిగా దొరికింది.
చిన్నప్పుడు ఇసుకలో పుల్ల దాచి వెతికే ఆట ఆడుకునే వాళ్ళం.  దానికీ ఓ పాటుందని తెలిసింది.  ఇలాంటి చిన్న చిన్న పాటలు ఒక ముప్ఫై వరకు ఉన్నాయి ఇందులో. నాకెందుకో "బావా బావా పన్నీరు", "బుర్రు పిట్ట" వంటి పాటలు ఇబ్బందిగా అనిపిస్తాయి పిల్లలతో కలిసి పాడుకోవడానికి.
రెండోది, అసలు ఇంట మంచి పాటలు  ఉన్నాయని సమయానికినాకు తెలియలేదే  అనిపించేలా దొరికిన కొన్ని మంచి పాటల పుస్తకం,  "జేజి మామయ్య పాటలు".  ఈ పుస్తకం నండూరి పబ్లికేషన్స్ వారిది. రాసిన వారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు. బొమ్మలు బాపు. నండూరి పబ్లికేషన్స్ వారు మంచి పుస్తకాలను ప్రచురిస్తున్నారు. కాని, బాపు గారి బొమ్మలు కొన్ని, పదే పదే అన్ని పుస్తకాలలోనూ వాడుతున్నారు. కొన్ని సందర్భాలలో అవి బాగా నప్పుతున్నాయి. కొన్ని చోట్ల అలా రిపీట్ చెయ్యడం ఆ బొమ్మలకి, రచనలకి కూడా అవమానంగా అనిపిస్తోంది. అది ఒక్కటే ప్రచురణ పరంగా ఈ పుస్తకం గురించి నా కంప్లెయింటు.  కొన్నందుకు త్రుప్తినిచ్చిన పుస్తకాలలో ఇది ఒకటి. కొన్నది AVKF  ద్వారా. వారి గురించి వివరంగా ఇక్కడ చదవగలరు.

రచ్చబండలో పరిచయం అయిన మోహనరావు గారు, కొన్ని పాటలు అంతర్జాలంలో ఇక్కడ చూపించారు. ఇందులో "అమ్మా వెతుక్కో" అన్న పాట telugu4kiDs ఆణిముత్యాలులో, లేదా ఇక్కడ చూడగలరు. ఇందులో నాకు కొన్ని పాటలు చాలా చాలా నచ్చాయి. ఉదాహరణకు, "దోబూచి", "బురుకూ బురికీలు", "డీ డిక్కి", "తాయిలం", "అమ్మా వెతుక్కో", "కర్ర గుర్రం". కొన్ని  చాలా కష్టపడి రాసినట్లు అనిపించింది. కొన్ని ఎవరైనా మంచిగా పాడి వినిపిస్తే బాగుండును, అప్పుడు నేర్చుకోబుద్ధవుతుంది అనిపించింది.

బాలసాహిత్యంలో నాకు పరిచయమైన కొన్ని మంచి తెలుగు పుస్తకాలు, పాటలు ఇవి.

Wednesday, May 26, 2010

అమ్మమ్మ చెప్పిన కథలు

కల్పన గారి అన్వేషణ నా జ్ఞాపకాల తుట్టను కదిలించింది. కల్పన గారి టపాకు వెంటనే వ్యాఖ్య కూడా రాసేసాను. ఐతే ముద్దకో కథ చెప్పినా అన్నం తినకుండా వేధించుకుని తిన్న నాకు ఈ ఒక్క కథే కాదు కదా తను చెప్పింది అని తరిచి చూసుకున్నాను.
ఇంకొన్ని పిల్లల పుస్తకాలు పరిచయం చెయ్యడం కోసం వాటిని మళ్లీ చదివి విషయం సిద్ధం చేసుకుని రాయబోయే దానిని కాస్తా చిన్నప్పటి కథలు రాయకుండా ముందుకు పోలేక ఈ టపా ఆ జ్ఞాపకాలకి అంకితమిస్తున్నాను.
మా అమ్మమ్మ ఎక్కువగా చిన్ని కృష్ణుడి కథలు చెప్పేది అని గుర్తు. దివ్య శక్తులు ప్రదర్శించే చిన్ని కృష్ణుడికి ప్రతి కథలోనూ యశోదమ్మ దిష్టి తీయడంతో కథ ముగిసేది. తల్లికి దేవుడైనా తన పిల్లాడు చంటి పాపాయే అని మా అమ్మమ్మ చెప్పకనే చెప్పేది.  
ఈ మధ్యే ఒక టపాలో చదివాను, పెద్ద వారు చెప్పే కథల కోసం చిన్నప్పుడు వాళ్ళు బుద్ధిగా అన్నం తినేసి సిద్ధమయ్యే వారని. పాపం మా అమ్మమ్మకి  అలాంటి అదృష్టాన్నివ్వలేదు నేను. ఎన్ని కథలు చెప్పినా సరిపోక పొతే పక్కింట్లో తన స్నేహితురాలిని అడిగి మరిన్ని కథలు చెప్పించినా నా మారాము తీరేది కాదు. మా పిల్లలతో నేను ఇప్పుడంతా ఓపికగా లేకపోయినప్పుడు తను నాకు చేసిన సేవ అర్థమయ్యి సిగ్గేస్తుంది.
ఇవి కాక ఇతర కథల్లో "పుటుక్కు, జర జర, డుబుక్కు, మే" అనే కథ బాగా గుర్తుండిపోయింది. అది మాగంటి వారి పిల్లల పేజిలో చూసినప్పుడు మరింత సంతోషం వేసింది. మరి ఇంకా ఇలాంటి కథలు ఏమి చెప్పలేదా అనుకుంటుంటే కాశీ మజిలీ  కథలు చెప్పడం గుర్తుకు వచ్చింది.
ఇంకో కథ చెప్పేది. అల్లుడు అత్తవారింటికి వెళ్తూ దారిలో అమ్మ ఇచ్చిన వస్తువును ఇంకో వస్తువు నచ్చి ఇచ్చేసి అది తీసుకోవడం, అలా దారంతా  ఒకటిచ్చి ఇంకోటి తీసుకుంటూ చివరికి ఏదో హాస్యాస్పదమైన వస్తువు తీసుకు వెళ్ళడంతో ముగుస్తుంది కథ. అందులో ఒక సంఘటన మాత్రం గుర్తుండిపోయింది. చిటికె తీసుకుంటాడు. స్నానానికని చెరువులో దిగే ముందు భద్రంగా గట్టు మీద పెట్టి నీళ్లలోకి దిగుతాడు. స్నానం చేసాక తడి చేతులతో ఆ చిటికె తీసుకుని మళ్లీ ప్రయత్నిస్తే చిటికె శబ్దం రాదు. తన చిటికె పోయిందని బాధ పడతాడు.
ఇక ఇంకో కథ మొదటి సారి  మా మామయ్య చెప్తే విన్నట్టు గుర్తు. ఉల్లిపాయంత ఊర్లో మిరపకాయంత పొట్టి వాడు ఉండే వాడు. బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తే, దొండకాయంత దొంగవాడు వచ్చి తాటికాయంత తాళం పగలగొట్టి దొంగతనం చేసాడని సాగుతుంది కథ. ఆ కథ ఎలా ముగుస్తుందో గుర్తు లేదు. కానీ, ఇక ఇష్టం వచ్చినట్టు మధ్యలో వేరే వేరే కూరగాయలతో పాత్రలు సృష్టించేవాళ్ళమని మాత్రం గుర్తుంది. ఈ మామయ్యా, అత్తయ్యా ఇప్పటికి వాళ్ళ ఊర్లో పిల్లలకి కథలు చెప్తున్నారట. ఆ అత్తయ్య చెప్పింది, మనం పిల్లల కోసం అనుకుంటాం కాని, అది మన కోసం, మనం పొందగల సంతోషాల్లో ఒకటి అని.
ఇంకో మామయ్య నా కోసం ప్రత్యేకంగా కథలు చెప్పినట్లు గుర్తు లేదు కాని. వీధిలో పిల్లలనందరిని పోగేసుకుని కథలు చెప్పే వాడు. ఆటల పోటీలు పెట్టి చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చేవాడు.
ఇక మా అక్కా వాళ్ళు  కొత్త కొత్త కథలు చెప్పే వాళ్ళు. దయ్యం కథలు మొదటగా వాళ్ళ దగ్గరే విన్నట్టు గుర్తు. అమ్మమ్మ కథలు మరిగినా ఈ కొత్త కథల కోసం ఆశగా వాళ్ళ వెంట పదే దాన్ని.
మా నాన్న నీతులు చెప్పడానికి కథలు వాడే వారు. భర్తృహరి కథ తనే చెప్పారనుకుంటా. అలాగే ఈ మధ్య చందమామ ఆర్కైవులలో కనిపించింది: ఒక విద్యార్థి చదువు అయిపోయిందని గురువు గారు ఇలా తెలుసుకుంటారు. ఆ విద్యార్థి ఒక రోజు గురువు గారి భార్య వడ్డించిన చారు రుచి చూసి ఉప్పు సరిపోలేదనో, లేక రుచి బాలేదనో ఏదో చెప్తాడు. దానికి గురువు గారి భార్య నేను రొజూ కావాలనే ఇలా చేస్తున్నాను, ఈ రోజు తెలిసిందా అని అడుగుతుంది. అప్పుడు గురువు చెప్తాడు, ఇన్నాళ్ళు శిష్యుడి ధ్యాస విద్య మీద ఉంది. ఇప్పుడు రుచి తెలిసిందంటే అతని చదువు సంపన్నమయ్యిందని అన్నట్టు అని. ఆ కథ మా నాన్న చెప్పారు ఒక సారి, అలా ఉండాలి విద్యార్థి దశలో అని.  నా మొండితనం నాకు తెలుసు కాబట్టి ఆ కథలు నాకు కావలిసినదే  అనుకున్నా, మా అన్నయ్యకు అవి చెప్పడం, నాకు తనంటే ఉన్న సదభిప్రాయం వల్ల బాధ కలిగించేది. కానీ నా దాకా వచ్చేసరికి  మా పెద్దబ్బాయి వింటాడు కదా అని వాడిని అన్ని కథలతో పాటు, అలాంటి కథలతో కూడా తెగ తినేసేదాన్ని అని అర్థమయ్యింది. ఒక రోజు నేను కథ చెప్తానంటే వాడు వద్దన్నప్పుడు కలుక్కుమంది. సమయానికి నాకు తోటకూర కాడ కథ గుర్తుకొచ్చి తల్లి దండ్రులకూ నీతి పాఠాలు ఉంటాయి అని చెప్పాను. అనుకోకుండా మాలతి గారు నాకు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే నాకా కథ పంపించారు, సామెత కథల  శీర్షిక కోసం. ఆమె కథకు ఇచ్చిన ముగింపు నాకు గుర్తున్న దానికంటే సౌమ్యంగా ఉంది. telugu4kiDs  కి అనువుగా సరిపోయింది.  అప్పట్నుంచి సందార్భానికి తగిన కథ గుర్తొచ్చినా కష్టపడి ఆపుకుంటున్నాను. బాల సాహిత్యం గురించి నేను చేసే విమర్శలు ఒక సారి నాకే అన్వయించుకుని మళ్లీ కాస్త దారిలోకొస్తున్నాను. 
ఇంతకీ ఈ జ్ఞాపకాలు ఇక్కడ రాసినన్ని మాత్రమే కాదు. నేను రాయగాలిగినవి మాత్రమే. రాయలేనివి ఎన్నో. కథలు చాలా మటుకు పూర్తిగా గుర్తు లేవు. అసంపూర్తిగా ఉన్న కథలలో దేనికైనా  పూర్తి కథ ఎవరైనా తెలియజేయగలిగితే చాలా సంతోషం.

Wednesday, May 12, 2010

అందాల అఆలు

బాపు బొమ్మల అందమే వేరు. అందమైన తెలుగు భాషకి పరిచయము అందమైన బొమ్మలతోనే. ఆనందించాల్సిన  విషయం కదూ.  AVKF వారి బాల సాహిత్యంలో వరుస క్రమంలో ఓపికగా వెతుక్కుంటే కనిపిస్తుంది ఈ పుస్తకం. "అ అమ్మ, ఆ ఆవు, ఇ ఇల్లు, ఈ ఈగ..." ఇలా నేర్చుకున్నాము చిన్నప్పుడు. ఈ  పుస్తకంలో "అ అరటి" తో మొదలైనా, అమ్మ ఎత్తుకుంటే పిల్లాడు అరటిగెలకేసి చూపిస్తూ ఉంటుంది బొమ్మ.   అమ్మాయిలే  కాదు, బాపూ బొమ్మ అబ్బాయిలు అందంగానే  ఉంటారు. ఈ పుస్తకంలో అబ్బాయి బొమ్మలు ఎక్కువ ఉండడం కూడా బాగా అనిపించింది. వీలైన చోటల్లా పిల్లల బొమ్మలు జత చేసారు, పదం ఏదైనా. అది కూడా  బాగా అనిపించింది.  కి ఖడ్గ మృగం, కి టపాకాయ, కి రంగులు ఇలాంటి పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివరి పేజిలో అంకెలు వేసి ముగించారు, బావుంది. అక్షరాలు అయ్యాయి ఇక అంకెలు నేర్చుకోవచ్చు అన్నట్లు. అది బావుంది.
తో, తో ఏ పదమూ ఇవ్వలేదు.  క వర్గం లో, చ వర్గం లో చివరి అక్షరాలకు పదాలు లేక వదిలేయవలసి వచ్చింది అనుకుంటాను. ఇది పరవాలేదు కాని, ఇంకొక్క పేజి జత చేసి వర్ణమాల అంతా చూపించి ఉంటే  బావుండేదేమో.
ఇక ఈ పుస్తకం బావుంది, కొని మంచి పని చేసాను అనిపించింది. సినిమాలు తీసే వారు చిన్న పిల్లల కోసం పుస్తకం తయారు చేసి పెద్ద వారు, పేరున్న వారు ఇలా చెయ్యచ్చు అని దారి చూపించినట్లు అనిపించింది. అ ఆలు రుచి చూపించారు కదా, మరి ఇక గుణింతాలు, వత్తులు, అంకెలు ...?
ఇక నా వంతు ప్రయత్నం అక్షరాలూ, అంకెలు,  ఇంకా , గుణింతాలు, వత్తులు లేని రెండు, మూడు అక్షరాల పదాలు, గుణింతాలు, జంట పదాలు, ఇలా పిల్లలను ఆకట్టుకోవటానికి ఆటలు  చూసి అభిప్రాయాలు చెప్పా గలరు. telugu4kiDs   గణాంకాల ప్రకారం బహుశా ఎక్కువ చూసేవి ఈ printables .

Monday, May 10, 2010

ఏమో? గుర్రం ఎగరా వచ్చు!



మీ పిల్లల ఉహా శక్తికి పదును పెట్టండి. ఈ కథ ఎలా ముగిసి ఉండి ఉండచ్చో వారిని అడగండి. ఆ సమాధానాలు ఇక్కడ వ్యాఖ్యగా రాయండి!
మరిన్ని సామెత కథలు ఇక్కడ చూడగలరు.

Sunday, May 9, 2010