Pages

Thursday, June 10, 2010

పెద్దల కోసం పిల్లల పాటలు, పుస్తకాలు

అడగకుండానే  అందుబాటులో బోలెడన్ని ఆంగ్ల పాఠాలు. ఎన్నో చిన్న చిన్న రైమ్సు, చిట్టి పొట్టి పాటలు. బాల్యం సరదాగా గడవడానికి అందమైన ఆటపాటలు, కథలు, పుస్తకాలు ఆంగ్లంలో అందుబాటులో ఉంటాయి. అవసరం అయితే కొని అయినా ఆంగ్లం మన పిల్లలకి దగ్గర చేయడానికి మనం వెనకాడము. ఎంతగా తల్లి పిల్లలతో తన భాషలోనే మాట్లాడినా, సరదాలకి, ఆట పాటలకి వచ్చే సరికి ఆంగ్లం ఉన్నంత అనువుగా తెలుగు ఉన్నదా అంటే నా అవసరానికి మాత్రం ఆంగ్లమే ఎక్కువ అందుబాటులో ఉండినది అని చెప్తాను. తెలుగు దూరం ఐపోతోంది అన్న  బాధ ఉన్నా, బాల్యం ఇంకా విలువైనది కనుక నేను నేర్చుకునే లోపు వాళ్ళు సరదాలు కోల్పో కూడదు అని అందుబాటులో ఉన్న ఆటపాటలన్నీ  భాష గురించి ఆలోచించడం మాని, వారు ఆస్వాదించేలా చేసాను.  అప్పటికీ మొన్నో రోజు బయట ఉన్నప్పుడు చిన్న జల్లు పడుతుంటే మా చిన్నబ్బాయి "వానా వానా వల్లప్పా!" అంటూ ఆనందంగా పాడుతుంటే నాకు నేను మరీ అంత లోటు చెయ్యలేదని అనిపించింది.
పిల్లలకు అవసరమైన తెలుగు నేను నేర్చుకోవడం కోసం వారి పసితనంలో మొదలు పెట్టిన అన్వేషణ ఇంకా కొనసాగిస్తూ ఉన్నాను.  అలా తెలిసినవి నా వంటి వారి కోసం వీలైన చోటల్లా తెలియ చేస్తూ వస్తున్నాను.
ప్రస్తుతం, చిన్న పిల్లలకు పాడి వినిపించగల పాటలు కొన్ని, నాకు చాలా బాగా నచ్చినవి, అవి ఉన్న పుస్తకాలు, అంతర్జాలంలో అలాంటివి కనిపించే చోట్లు పరిచయం చేసే ప్రయత్నం.
మొదటి పుస్తకం "గోరు ముద్దలు". ఇది తెలుగు పుస్తకాల  కోసం అడగగా అడగగా, ఎలాగో నా చేతికి వచ్చిన పుస్తకం, చాలా పాతది అనుకుంటాను.
బాలల అకాడమి వారి ప్రచురణ. ఇందులో బాగా పరిచయమైన  "ఏనుగు ఏనుగు నల్లన", "తప్పట్లోయ్ తాళాలోయ్" వంటి పాటలు ఉన్నాయి. ఇందులో "చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం" పాట పూర్తిగా దొరికింది.
చిన్నప్పుడు ఇసుకలో పుల్ల దాచి వెతికే ఆట ఆడుకునే వాళ్ళం.  దానికీ ఓ పాటుందని తెలిసింది.  ఇలాంటి చిన్న చిన్న పాటలు ఒక ముప్ఫై వరకు ఉన్నాయి ఇందులో. నాకెందుకో "బావా బావా పన్నీరు", "బుర్రు పిట్ట" వంటి పాటలు ఇబ్బందిగా అనిపిస్తాయి పిల్లలతో కలిసి పాడుకోవడానికి.
రెండోది, అసలు ఇంట మంచి పాటలు  ఉన్నాయని సమయానికినాకు తెలియలేదే  అనిపించేలా దొరికిన కొన్ని మంచి పాటల పుస్తకం,  "జేజి మామయ్య పాటలు".  ఈ పుస్తకం నండూరి పబ్లికేషన్స్ వారిది. రాసిన వారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు. బొమ్మలు బాపు. నండూరి పబ్లికేషన్స్ వారు మంచి పుస్తకాలను ప్రచురిస్తున్నారు. కాని, బాపు గారి బొమ్మలు కొన్ని, పదే పదే అన్ని పుస్తకాలలోనూ వాడుతున్నారు. కొన్ని సందర్భాలలో అవి బాగా నప్పుతున్నాయి. కొన్ని చోట్ల అలా రిపీట్ చెయ్యడం ఆ బొమ్మలకి, రచనలకి కూడా అవమానంగా అనిపిస్తోంది. అది ఒక్కటే ప్రచురణ పరంగా ఈ పుస్తకం గురించి నా కంప్లెయింటు.  కొన్నందుకు త్రుప్తినిచ్చిన పుస్తకాలలో ఇది ఒకటి. కొన్నది AVKF  ద్వారా. వారి గురించి వివరంగా ఇక్కడ చదవగలరు.

రచ్చబండలో పరిచయం అయిన మోహనరావు గారు, కొన్ని పాటలు అంతర్జాలంలో ఇక్కడ చూపించారు. ఇందులో "అమ్మా వెతుక్కో" అన్న పాట telugu4kiDs ఆణిముత్యాలులో, లేదా ఇక్కడ చూడగలరు. ఇందులో నాకు కొన్ని పాటలు చాలా చాలా నచ్చాయి. ఉదాహరణకు, "దోబూచి", "బురుకూ బురికీలు", "డీ డిక్కి", "తాయిలం", "అమ్మా వెతుక్కో", "కర్ర గుర్రం". కొన్ని  చాలా కష్టపడి రాసినట్లు అనిపించింది. కొన్ని ఎవరైనా మంచిగా పాడి వినిపిస్తే బాగుండును, అప్పుడు నేర్చుకోబుద్ధవుతుంది అనిపించింది.

బాలసాహిత్యంలో నాకు పరిచయమైన కొన్ని మంచి తెలుగు పుస్తకాలు, పాటలు ఇవి.

2 comments:

  1. నమస్తే లలితగారూ బాగున్నారా?

    ReplyDelete
  2. bagunnayamDi, mee balala sahitya pustakaalu.

    ReplyDelete