Pages

Tuesday, September 21, 2010

గొలుసు కథలు

(ఈ వ్యాసం మొదట పుస్తకం.నెట్ లో ప్రచురించబడింది.)

చిన్నప్పుడు విన్న మరిచిపోలేని కథలు కొన్ని కల్పన, రవికిరణ్ గార్ల పుణ్యమా అని, కొంతమంది బ్లాగర్లు గుర్తు చేసుకున్నారు. ఈగ కథ, పేను పెసర చేను కథ, ఏడు చేపల కథ లాంటి కథలను గొలుసు కథలంటారేమో కదా. అలా ఒక దానికి ఇంకొకటి కలుపుతూ కథ పొడుగ్గా తయారయ్యి చివరకు ఒక కొసమెరుపు ఉంటుంది సాధారణంగా. ఎందుకో మరి ఇటువంటి కథలు తెలుగులో పిల్లల్ల కథల పుస్తకాలలో కనిపించలేదు నాకు ఇంతవరకూ. ఏడు చేపల కథ పుస్తకంగా ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు. పుస్తకం.నెట్ వారు మంచిపుస్తకం వారితో ముచ్చటించినప్పుడు అనువాదాలు కాకుండా నేరుగా తెలుగులో కథలు కావాలంటే కష్టమన్నారు. ఇప్పుడు అంతర్జాలంలో కొన్ని కథలు బయటికి వచ్చాయి. ఇంకొంచెం ప్రయత్నిస్తే ఇంకెన్నో గుర్తుకు వస్తాయి.

చందమామకథలు అనగానే, అవి చిన్న పిల్లలకు పనికిరావనే అభిప్రాయం ఉండేది నాకు. చందమామ అంటే నాకెంతో ఇష్టం. కాని, ఆ కథలు కనీసం పదేళ్ళ పై వయసున్న పిల్లలకే అర్థం అవుతాయనుకునే దాన్ని. నా అదృష్టం కొద్దీ, నా కళ్ళూ తెరిపించేందుకు, పాత చందమామ కథలు ఆంగ్లంలోకి అనువదించే పనిలో నాకూ భాగం కలిగింది. ఆ విధంగా 1947 ప్రాంతాలలో కొన్ని కథలు, నా అంతట నేను ఎప్పుడో కాని చదివి ఉండే అవకాశం లేకపోయిన కథలు నేను చదవగలిగాను. మా పిల్లలతో పంచుకోగలిగాను. అందులో "బుళుక్కు" అనే కథకి మా చిన్నబ్బాయి బొమ్మ వేసిచ్చాడు కూడాను.

ఆ కథలలో ఒకటి,  చీమా, చిలకా పాయసం వండుకోవడంతో మొదలయ్యి, ఒక ప్రమాదం, తర్వాత కోపంలో అనుకున్న మాటలు నిజం కావడం జరిగి, తోటికోడళ్ళ భుజాలకు బిందెలు అంటుకు పోయేంతవరకూ ఒక దాని తరవాత ఒకటి వింత సంఘటనలు, చివరికి కథ సుఖాంతం. ఇటువంటి కథ ఇప్పటి కాలానికి తగ్గట్టు ఆంగ్లంలో The Rain Came Down!  మా పిల్లల కోసం చిన్నప్పుడు కొన్నాను. ఇలాంటి పుస్తకాలు ఎప్పటికీ ఉంచుకోవాలనిపిస్తుంది. నేను కొన్నింటిని వదలలేక, వదలలేక చదువుతారునుకున్న వారికి కొన్ని ఇచ్చాను. ఈ కథలు పిల్లలకి సరదాను, పెద్దవాళ్ళకి సందేశాలను ఇస్తాయి. ఆసక్తి కలవారు చందమామ ఆర్కైవులలో ఇలాంటి కథలను ఇంకా వెతికి పట్టుకోగలరు. ఒక క్లూ: 1947 దగ్గరి ప్రాంతాలలో ఇటువంటి కథలు ఎక్కువ ఉన్నాయి.

పేను, పెసర చేను కథ తెలిసినప్పుడూ ఇంకో ఆంగ్ల పుస్తకం గుర్తుకు వచ్చింది: "The Old Woman and the Rice thief". చూశారుగా, అట్ట ఏ స్థితిలో ఉందో. కానీ పుస్తకం భద్రంగా ఉంది. ఇది ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో అతి తక్కువ ధరకు కొన్నాము. ఇప్పటికీ అప్పుడప్పుడూ పిల్లలతో కలిసి పేజీలు తిరగేస్తుంటాము.
మన ఇల్లలికిన ఈగ కథ కి సమాంతరంగా ఇంకో పుస్తకం గుర్తుకు వస్తుంది: Why Mosquitoes Buzz in People's Ears.

ఆంగ్లంలో పుస్తకాల గురించి వివరంగా రాయట్లేదు. ఇచ్చిన లంకెను పట్టుకున్నా, గూగులమ్మను అడిగినా బోలెడన్ని వివరాలు లభ్యం. నేను నొక్కి చెప్పాలనుకున్న విషయం ఆ కథలు కాదు, ఆ కథలను పిల్లలకు అందించిన తీరు. ఇలా మనం పూనుకోవాలే కాని, నేరుగా తెలుగులో మనం చాలా పుస్తకాలను తయారు చేయ వచ్చు. కథకు తగ్గ బొమ్మలు, కథనం, ఓపికగా, ఇష్టంగా, శ్రద్ధగా జత చేసి చక్కగా పిల్లలనూ, తెలుగునూ, పాత కొత్త తరాలనూ ఒకరికి ఒకరిని దగ్గర చేయవచ్చు.

మరి పిల్లి మెడలో గంట కడదామా?

Tuesday, September 14, 2010

ఈనాడు వసుంధరలో - అంతర్జాలంలో తెలుగు పిల్లల కోసం


ఈనాడు వసుంధరలో ఈ నాడు అంతర్జాలంలో తెలుగు పిల్లల కోసం, పిల్లల చేత ప్రదర్శించబడుతున్న కథల గురించి కథనాలు ప్రచురించారు.
అందులో telugu4kiDs ను ప్రస్తావించారు. కొందరు ఆ కథనం చూసి telugu4kiDs ki వచ్చామని అభినందనలు, సంతోషం తెలియచేసారు.
సంతోషంగా ఉంది.
మా కుటుంబమంతా ఉత్సాహంగా పాల్గొనే  ఇష్టమైన పని telugu4kiDs . ఈ అభినందనలు, సంతోషము మా అందరివీ.
కొన్ని వివరాలు పొరపాటుగా ప్రచురించారు.
పూర్తి వివరాలు నా మాటలలో ఇక్కడ.
పరిచయం చేసుకునేటప్పట్నుంచి పొరపాట్ల గురించి చెప్పినప్పుడు కూడా ఎంతొ ససహృదయంతో సంభాషించిన హిదయ్ గారికి ధన్యవాదాలు.
కంప్యూటర్ ఎరా లో telugu4kiDs గురించి పరిచయం చేసిన జ్యోతి గారు ఈ నాడు ఈ నాడు దాకా పేరు తెలిసేలా చేసారు. తనకి ధన్యవాదాలు.
ప్రభవ పబ్లికేషన్స్ సరసన telugu4kiDs పరిచయం telugu4kiDs గౌరవాన్ని పెంచుతోంది.
జాబిల్లి గురించి ఈ మధ్యే తెలిసింది.  వారి పరిచయంతోనే ఈ నాడు కథనం మొదలయ్యింది. వారికి అభినందనలు.
కొత్తపల్లి వారి గురించీ, బుక్ బాక్స్ గురించీ కూడా తెలుగు4కిడ్స్ కథనంలో ప్రస్తావించడం ఆనందదాయకం.
 
బుక్ బాక్స్ వారి కథలను కొన్నిటిని తెలుగులోకి అనువదించి గొంతు అందించాను.
అందులో ఈ కథ పూర్తిగా ఉచితం. అందరూ చూడవచ్చు.

కొత్తపల్లి వారి ఉత్సాహంలో తెలుగు4కిడ్స్ కూడ కొంత పాలు పంచుకుంటోంది.
కొన్ని లంకెలు.
http://kottapalli.in/2010/09/టీ
http://kottapalli.in/2010/08/బొమ్మకు_కథ_రాయండి
http://kottapalli.in/2010/07/ఏమో_గుర్రం
http://kottapalli.in/2010/07/అమ్మ_దొంగా


అందరి అభిమానం, ఆశీర్వచనాలతో తెలుగు4కిడ్స్ తన ఆశయాలను అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.