బాపు బొమ్మల అందమే వేరు. అందమైన తెలుగు భాషకి పరిచయము అందమైన బొమ్మలతోనే. ఆనందించాల్సిన విషయం కదూ. AVKF వారి బాల సాహిత్యంలో వరుస క్రమంలో ఓపికగా వెతుక్కుంటే కనిపిస్తుంది ఈ పుస్తకం. "అ అమ్మ, ఆ ఆవు, ఇ ఇల్లు, ఈ ఈగ..." ఇలా నేర్చుకున్నాము చిన్నప్పుడు. ఈ పుస్తకంలో "అ అరటి" తో మొదలైనా, అమ్మ ఎత్తుకుంటే పిల్లాడు అరటిగెలకేసి చూపిస్తూ ఉంటుంది బొమ్మ. అమ్మాయిలే కాదు, బాపూ బొమ్మ అబ్బాయిలు అందంగానే ఉంటారు. ఈ పుస్తకంలో అబ్బాయి బొమ్మలు ఎక్కువ ఉండడం కూడా బాగా అనిపించింది. వీలైన చోటల్లా పిల్లల బొమ్మలు జత చేసారు, పదం ఏదైనా. అది కూడా బాగా అనిపించింది. ఖ కి ఖడ్గ మృగం, ట కి టపాకాయ, ర కి రంగులు ఇలాంటి పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివరి పేజిలో అంకెలు వేసి ముగించారు, బావుంది. అక్షరాలు అయ్యాయి ఇక అంకెలు నేర్చుకోవచ్చు అన్నట్లు. అది బావుంది.
ఋ తో, ఱ తో ఏ పదమూ ఇవ్వలేదు. క వర్గం లో, చ వర్గం లో చివరి అక్షరాలకు పదాలు లేక వదిలేయవలసి వచ్చింది అనుకుంటాను. ఇది పరవాలేదు కాని, ఇంకొక్క పేజి జత చేసి వర్ణమాల అంతా చూపించి ఉంటే బావుండేదేమో.
ఇక ఈ పుస్తకం బావుంది, కొని మంచి పని చేసాను అనిపించింది. సినిమాలు తీసే వారు చిన్న పిల్లల కోసం పుస్తకం తయారు చేసి పెద్ద వారు, పేరున్న వారు ఇలా చెయ్యచ్చు అని దారి చూపించినట్లు అనిపించింది. అ ఆలు రుచి చూపించారు కదా, మరి ఇక గుణింతాలు, వత్తులు, అంకెలు ...?
ఇక నా వంతు ప్రయత్నం అక్షరాలూ, అంకెలు, ఇంకా , గుణింతాలు, వత్తులు లేని రెండు, మూడు అక్షరాల పదాలు, గుణింతాలు, జంట పదాలు, ఇలా పిల్లలను ఆకట్టుకోవటానికి ఆటలు చూసి అభిప్రాయాలు చెప్పా గలరు. telugu4kiDs గణాంకాల ప్రకారం బహుశా ఎక్కువ చూసేవి ఈ printables .
No comments:
Post a Comment