కల్పన గారి అన్వేషణ నా జ్ఞాపకాల తుట్టను కదిలించింది. కల్పన గారి టపాకు వెంటనే వ్యాఖ్య కూడా రాసేసాను. ఐతే ముద్దకో కథ చెప్పినా అన్నం తినకుండా వేధించుకుని తిన్న నాకు ఈ ఒక్క కథే కాదు కదా తను చెప్పింది అని తరిచి చూసుకున్నాను.
ఇంకొన్ని పిల్లల పుస్తకాలు పరిచయం చెయ్యడం కోసం వాటిని మళ్లీ చదివి విషయం సిద్ధం చేసుకుని రాయబోయే దానిని కాస్తా చిన్నప్పటి కథలు రాయకుండా ముందుకు పోలేక ఈ టపా ఆ జ్ఞాపకాలకి అంకితమిస్తున్నాను.
మా అమ్మమ్మ ఎక్కువగా చిన్ని కృష్ణుడి కథలు చెప్పేది అని గుర్తు. దివ్య శక్తులు ప్రదర్శించే చిన్ని కృష్ణుడికి ప్రతి కథలోనూ యశోదమ్మ దిష్టి తీయడంతో కథ ముగిసేది. తల్లికి దేవుడైనా తన పిల్లాడు చంటి పాపాయే అని మా అమ్మమ్మ చెప్పకనే చెప్పేది.
ఈ మధ్యే ఒక టపాలో చదివాను, పెద్ద వారు చెప్పే కథల కోసం చిన్నప్పుడు వాళ్ళు బుద్ధిగా అన్నం తినేసి సిద్ధమయ్యే వారని. పాపం మా అమ్మమ్మకి అలాంటి అదృష్టాన్నివ్వలేదు నేను. ఎన్ని కథలు చెప్పినా సరిపోక పొతే పక్కింట్లో తన స్నేహితురాలిని అడిగి మరిన్ని కథలు చెప్పించినా నా మారాము తీరేది కాదు. మా పిల్లలతో నేను ఇప్పుడంతా ఓపికగా లేకపోయినప్పుడు తను నాకు చేసిన సేవ అర్థమయ్యి సిగ్గేస్తుంది.
ఇవి కాక ఇతర కథల్లో "పుటుక్కు, జర జర, డుబుక్కు, మే" అనే కథ బాగా గుర్తుండిపోయింది. అది మాగంటి వారి పిల్లల పేజిలో చూసినప్పుడు మరింత సంతోషం వేసింది. మరి ఇంకా ఇలాంటి కథలు ఏమి చెప్పలేదా అనుకుంటుంటే కాశీ మజిలీ కథలు చెప్పడం గుర్తుకు వచ్చింది.
ఇంకో కథ చెప్పేది. అల్లుడు అత్తవారింటికి వెళ్తూ దారిలో అమ్మ ఇచ్చిన వస్తువును ఇంకో వస్తువు నచ్చి ఇచ్చేసి అది తీసుకోవడం, అలా దారంతా ఒకటిచ్చి ఇంకోటి తీసుకుంటూ చివరికి ఏదో హాస్యాస్పదమైన వస్తువు తీసుకు వెళ్ళడంతో ముగుస్తుంది కథ. అందులో ఒక సంఘటన మాత్రం గుర్తుండిపోయింది. చిటికె తీసుకుంటాడు. స్నానానికని చెరువులో దిగే ముందు భద్రంగా గట్టు మీద పెట్టి నీళ్లలోకి దిగుతాడు. స్నానం చేసాక తడి చేతులతో ఆ చిటికె తీసుకుని మళ్లీ ప్రయత్నిస్తే చిటికె శబ్దం రాదు. తన చిటికె పోయిందని బాధ పడతాడు.
ఇక ఇంకో కథ మొదటి సారి మా మామయ్య చెప్తే విన్నట్టు గుర్తు. ఉల్లిపాయంత ఊర్లో మిరపకాయంత పొట్టి వాడు ఉండే వాడు. బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తే, దొండకాయంత దొంగవాడు వచ్చి తాటికాయంత తాళం పగలగొట్టి దొంగతనం చేసాడని సాగుతుంది కథ. ఆ కథ ఎలా ముగుస్తుందో గుర్తు లేదు. కానీ, ఇక ఇష్టం వచ్చినట్టు మధ్యలో వేరే వేరే కూరగాయలతో పాత్రలు సృష్టించేవాళ్ళమని మాత్రం గుర్తుంది. ఈ మామయ్యా, అత్తయ్యా ఇప్పటికి వాళ్ళ ఊర్లో పిల్లలకి కథలు చెప్తున్నారట. ఆ అత్తయ్య చెప్పింది, మనం పిల్లల కోసం అనుకుంటాం కాని, అది మన కోసం, మనం పొందగల సంతోషాల్లో ఒకటి అని.
ఇంకో మామయ్య నా కోసం ప్రత్యేకంగా కథలు చెప్పినట్లు గుర్తు లేదు కాని. వీధిలో పిల్లలనందరిని పోగేసుకుని కథలు చెప్పే వాడు. ఆటల పోటీలు పెట్టి చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చేవాడు.
ఇక మా అక్కా వాళ్ళు కొత్త కొత్త కథలు చెప్పే వాళ్ళు. దయ్యం కథలు మొదటగా వాళ్ళ దగ్గరే విన్నట్టు గుర్తు. అమ్మమ్మ కథలు మరిగినా ఈ కొత్త కథల కోసం ఆశగా వాళ్ళ వెంట పదే దాన్ని.
మా నాన్న నీతులు చెప్పడానికి కథలు వాడే వారు. భర్తృహరి కథ తనే చెప్పారనుకుంటా. అలాగే ఈ మధ్య చందమామ ఆర్కైవులలో కనిపించింది: ఒక విద్యార్థి చదువు అయిపోయిందని గురువు గారు ఇలా తెలుసుకుంటారు. ఆ విద్యార్థి ఒక రోజు గురువు గారి భార్య వడ్డించిన చారు రుచి చూసి ఉప్పు సరిపోలేదనో, లేక రుచి బాలేదనో ఏదో చెప్తాడు. దానికి గురువు గారి భార్య నేను రొజూ కావాలనే ఇలా చేస్తున్నాను, ఈ రోజు తెలిసిందా అని అడుగుతుంది. అప్పుడు గురువు చెప్తాడు, ఇన్నాళ్ళు శిష్యుడి ధ్యాస విద్య మీద ఉంది. ఇప్పుడు రుచి తెలిసిందంటే అతని చదువు సంపన్నమయ్యిందని అన్నట్టు అని. ఆ కథ మా నాన్న చెప్పారు ఒక సారి, అలా ఉండాలి విద్యార్థి దశలో అని. నా మొండితనం నాకు తెలుసు కాబట్టి ఆ కథలు నాకు కావలిసినదే అనుకున్నా, మా అన్నయ్యకు అవి చెప్పడం, నాకు తనంటే ఉన్న సదభిప్రాయం వల్ల బాధ కలిగించేది. కానీ నా దాకా వచ్చేసరికి మా పెద్దబ్బాయి వింటాడు కదా అని వాడిని అన్ని కథలతో పాటు, అలాంటి కథలతో కూడా తెగ తినేసేదాన్ని అని అర్థమయ్యింది. ఒక రోజు నేను కథ చెప్తానంటే వాడు వద్దన్నప్పుడు కలుక్కుమంది. సమయానికి నాకు తోటకూర కాడ కథ గుర్తుకొచ్చి తల్లి దండ్రులకూ నీతి పాఠాలు ఉంటాయి అని చెప్పాను. అనుకోకుండా మాలతి గారు నాకు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే నాకా కథ పంపించారు, సామెత కథల శీర్షిక కోసం. ఆమె కథకు ఇచ్చిన ముగింపు నాకు గుర్తున్న దానికంటే సౌమ్యంగా ఉంది. telugu4kiDs కి అనువుగా సరిపోయింది. అప్పట్నుంచి సందార్భానికి తగిన కథ గుర్తొచ్చినా కష్టపడి ఆపుకుంటున్నాను. బాల సాహిత్యం గురించి నేను చేసే విమర్శలు ఒక సారి నాకే అన్వయించుకుని మళ్లీ కాస్త దారిలోకొస్తున్నాను.
ఇంతకీ ఈ జ్ఞాపకాలు ఇక్కడ రాసినన్ని మాత్రమే కాదు. నేను రాయగాలిగినవి మాత్రమే. రాయలేనివి ఎన్నో. కథలు చాలా మటుకు పూర్తిగా గుర్తు లేవు. అసంపూర్తిగా ఉన్న కథలలో దేనికైనా పూర్తి కథ ఎవరైనా తెలియజేయగలిగితే చాలా సంతోషం.