Pages

Thursday, November 18, 2010

మంచి పుస్తకం, తెలుగులో!

మా పిల్లలకు తెలుగు గుణింతాలు కూడా కలుపుకుని, అక్కడక్కడా వత్తులు కూడా అలవాటయ్యి, తెలుగు పదజాలం పెరిగినందువల్ల పదాలు గుణించుకుని చదవ గలుగుతున్నారు అనుకున్నాక, మంచిపుస్తకం వారి పుస్తకాల గురించి తెలిసి, కొని తెప్పించుకునే అవకాశం దొరికింది.

ఇది boxed set అనమాట. మొత్తం 18 పుస్తకాలు. ఇందులో అతి సులభం నుంచి కొద్దిగా కష్టం అనిపించే వరకూ ఉన్నాయి. రంగులతో ఆ level పుస్తకం పైన తెలుస్తూ ఉంటుంది. "పిల్లల భాషా ప్రపంచం - పుస్తకాల పరిచయం" అన్న పేరుతో ఈ సంగ్రహం దొరుకుతుంది. పేరుని సార్థకం చేస్తాయి ఈ పుస్తకాలు.

ఇందులో మా చిన్నబ్బాయిని ఆకర్షించిన పుస్తకం "సబ్బు". సబ్బూ, నీళ్ళు వాడికి అతి ఇష్టమైన వస్తువులలో చాలా ముందు ఉంటాయి. అల్లరి పిల్లాడి చేష్టలూ, మాటి మాటికీ మురికి చేసుకుని , ఇక కడుక్కోవడం ఎందుకూ అని వాడు అంటూ కథ ముగియడమూ సరదాగా ఉంటాయి. మా వాడికి కడుక్కోవడానికి కారణము ఉంటే చాలు, అది వేరే సంగతి.

ఐతే "క్లిష్టత" ని పెంచడం అన్నది నాకు ఎక్కువగా పేజీల సంఖ్యలోనే కనిపించింది. వారు డబ్బా పై వివరించినంత తేడా కనిపించలేదు. కానీ నష్టం లేదు. ఈ పుస్తకాల సెట్టు చదవడం నేర్చుకునే దశలో, చదవడం బాగా లవాటు కావడానికీ చాలా బావుంటుంది. పిల్లలని ఆకర్షించే బొమ్మలూ, సన్నివేశాలూ, చిన్న చిన్న వాక్యాలూ అన్నీ అనువుగా ఉన్నాయి. తెలుగు భాష అలవాటు చెయ్యడానికి ఇవి కొనదగ్గ పుస్తకాలు అని నేను నిస్సందేహంగా చెప్తాను.

ఐతే, ఎప్పటిలాగే, నా ఆలోచనలు కొన్ని:
ముందుగా, చిన్నవే అయినా, చెప్పాలనిపించినవి:
కొన్ని వాక్యాలు కాస్త నిండుగా రాస్తే బావుంటుందనిపించాయి, "వస్తా" బదులు "వస్తాను" అనీ, "ఆపేయ్" బదులు "ఆపెయ్యి" రాస్తే బావుంటుందనిపించింది. అలాగే  ఆంగ్లంలో "put off the light" బదులు "turn off the light" అనీ, (అన్నట్లు ఇవన్నీ ద్విభాషా పుస్తకాలు), దానికి అనువాదంగా తెలుగులో "లైటు తియ్యి" బదులు "లైటు ఆపెయ్యి" అనో వ్రాసి ఉంటే బాగుండేది అనిపించింది.

ఇంకొకటి, నా మటుకు నాకు, ఇవి ద్విభాషా పుస్తకాలు కానక్కర్లేదు అని గట్టి నమ్మకం.
తెలుగులోనే ఉంటే బావుంటుంది. ఆంగ్లం అనవసరమైన distraction. చాలా చిన్న వాక్యాలు. బొమ్మలే పెద్ద ఆధారం, అర్థం చేసుకోవడానికి. ఇక ఆంగ్లం అవసరం లేదు అని నా ఉద్దేశం. మరి తెలుగు ఆధారంగా ఆంగ్లం నేర్పేందుకు, బహుశా బావుంటాయేమో? ఏమో!

అన్నిటికన్నా పెద్ద కంప్లైంటు, ఇవి అనువాదాలుగానే తప్ప నేరుగా తెలుగులో ఇలా ఆలోచించి రాయలేమా? ఎందుకు ఆ బొమ్మలూ, ఊహా, భాషా పరమైన శ్రమ మన పబ్లిషర్లు తెలుగులో పెట్టడానికి కష్టపడతారు? నాకు అంతు చిక్కని ప్రశ్న. తెలుగులో రాసిన చందమామ కథలు పన్నెండు భాషలలోకి అనువాదమౌతాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు మాత్రం చాలా మటుకు అనువాదాలే లభ్యం అవుతాయి.

ఇతర భాషలలోని మంచి పుస్తకాలకి నాణ్యమైన అనువాదాలు లభ్యం కావా లనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ మొదటి మాటల నుంచీ కూడా అనువాదాలే ఐతే బాధేస్తుంది.

ఈ టపా చదివే వారికి ఈ లంకెలు ఆసక్తికరంగా అనిపించవచ్చు.

చిన్న, పెద్ద - తెలుగు4కిడ్స్ వీడియో

గుణింతాలు - బాలభారతి వారి వీడియో

Thursday, November 11, 2010

తెలుగు4కిడ్స్ కబుర్లు


కాళ్ళెందాకా పోయాయి? - ఈ పాట సాహిత్యం మాగంటి వారి సైటులో దొరుకుతుంది.
ఈ నాటి తండ్రీ కూతురు కలిసి రాసిన కొత్త పాట ఇక్కడ చూడగలరు.
ఇది తెలుగు4కిడ్స్ కోసం పంపించిన తండ్రీ కూతుర్లకు ధన్యవాదాలు.

కొత్తపల్లి వారి పత్రికలో తెలుగు4కిడ్స్ "బొమ్మకు కథ" శీర్షిక నిర్వహణలో పాలుపంచుకుంటోంది.
ఇందులో "భయం" అనే అంశంతో ఇచ్చిన బొమ్మకు మంచి స్పందన వచ్చింది.
పిల్లల మనసు పిల్లలకే బాగా తెలుస్తుందేమో అని ఈ నెల కూడ పిల్లలు వేసిన బొమ్మనే ఇంకొక దానిని
ఈ శీర్షికకు ఎన్నుకోవడం జరిగింది.

తెలుగు4కిడ్స్ కి అనుబంధంగా "తెలుగు మాటలు" కూడా మొదలు పెట్టడం జరిగింది
ఇందులో చిన్న చిన్న కథలు వినడానికీ, చిన్న చిన్న వ్యాసాలు చదవడానికీ చేర్చే ఉద్దేశ్యం ఉంది.
ఇందుకు ప్రేరణ స్టోరీనోరీ, మరియు, ఇక్కడి పాఠశాలలలో చదవడం ప్రోత్సహించడానికి అవలంబించే బోధనా పద్ధతులూ, సాధనాలూను. ఈ ప్రయత్నంలో ఆసక్తి ఉన్న పిల్లలూ పెద్దలూ అందరూ పాలు పంచుకోవచ్చు. పిల్లలు కథలే రాయక్కర్లేదు. బొమ్మలు వెయ్యవచ్చు. అతి తక్కువ నిడివితో వ్యాసాలూ రాయవచ్చు. చిన్న చిన్న వాక్యాలకి సైతం స్వాగతం చెప్తున్నాం.

తెలుగును పిల్లలకీ, పిల్లలని తెలుగుకీ దగ్గరగా చెయ్యడానికి మా వంతు ప్రయత్నం ఈ విధంగా కొనసాగుతోంది.